Wednesday, March 28, 2012

Mamatha Banarjee



మ  
తా
బె
ర్జీ


మమత... ధైర్యం గల అమ్మాయి.
దయగల అమ్మాయి.
కష్టాలు తెలిసిన అమ్మాయి.
అన్యాయాలను సహించలేకపోయిన అమ్మాయి.
అవన్నీ ఆమెను లీడర్‌ని చేశాయి.
రాజకీయాల వైపు లాగాయి.
సోనియాకు, మాయావతికి, జయలలితకు ఉన్నట్లు
మమతకు రాజకీయ గురువుల్లేరు.
ప్రజాసమస్యలే పరమోపదేశాలు!
పోరాటాలే ఆమెకు పాఠాలు, అధికార పీఠాలు!
‘‘నన్ను నేనైనా మర్చిపోతానేమో కానీ...
నందిగ్రామ్‌ను మర్చిపోలే ను’’ అని మమత తాజా స్టేట్‌మెంట్!
అవును. ప్రజలను పట్టించుకోనివారెవర్నీ
మమత మర్చిపోరు. కుర్చీలలో ఉండనివ్వరు.
అదామె లైఫ్ స్టయిల్.
అందుకే ఇదామె బయోగ్రఫీ!

అరచేతికి ఐదువేళ్లు. కాంగ్రెస్ కోర్ కమిటీకి ఐదు ముఖాలు.
సోనియా, చిదంబరం, ఆంటోనీ, ప్రణబ్, పటేల్.
సోనియా.. పార్టీ అధ్యక్షురాలు. చిదంబరం హోమ్ మంత్రి. ఆంటోనీ రక్షణమంత్రి. ప్రణబ్ ఆర్థికమంత్రి. పటేల్.. సోనియా రాజకీయ కార్యదర్శి.
ఎప్పుడన్నా ఈ ఐదుగురూ హఠాత్తుగా సమావేశం అయ్యారంటే - కొంపేదో మునగబోతోందని!
కొంప అంటే - దేశం అనుకునేరు. రాష్ట్రం అనుకునేరు. తెలంగాణా అనుకునేరు. ఉస్మానియా యూనివర్శిటీ అనుకునేరు! అవేం కాదు.
కొంపంటే - కాంగ్రెస్ పార్టీ.
మునగబోవడం అంటే - సపోర్టుగా ఉన్నవారు హ్యాండివ్వడానికి రెడీ అవడం.

********

మూడురోజుల క్రితం ఈ ఐదుగురూ ఇలాగే ఉరుకులు పరుగుల మీద సమావేశం అయ్యారు.
కారణం - మమతా బెనర్జీ!
ఆవిడేం గవర్నమెంటును పడగొడతానని అన్లేదు. బెదిరించలేదు. కనీసం హెచ్చరించలేదు. కోపంలో చిన్న కోరిక కోరారంతే!
రైల్వే మంత్రి దినేశ్ త్రివేదిని తీసేయమన్నారు. అంటే - పరుగెడుతున్న రైల్లోంచి ఆయన్ని తోసేయడం!
బడ్జెట్ బరువు సామాన్యులపై పడేందుకు లేదన్నారు. అంటే - పార్టీ కన్నా నాకు ప్రజలే ముఖ్యమని చెప్పడం.
మమత కోరింది కోరికే కానీ, ప్రధాని దాన్ని ఆదేశంలా స్వీకరించవలసి వచ్చింది.
కోర్ కమిటీ పగలంతా ఆ లెక్కా ఈ లెక్కా వేసి, చివరికి మిడ్‌నైట్ మీటింగ్‌లో ఒక నిర్ణయానికి వచ్చింది. పోతే పోయాడు దినేశ్... వాళ్ల పార్టీ (తృణమూల్) మంత్రే కదా మనకేం పోతుంది అనుకుంది. మమత చెప్పినట్లు చేస్తే పరువు పోయినా మన పవర్ అయితే ఉంటుంది కదా అని కూడా అనుకున్నట్లుంది. అప్పటికప్పుడు మన్మోహన్‌సింగ్ చేత ఓకే చెప్పించింది. దినేశ్ పదవి ప్రస్తుతం రైలు పట్టాలపై సాగుతున్న నాణెంలా ఉంది. ఉండినా, ఊడినా అంతా మమత దయ.

********

మమతా బెనర్జీ... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రులకు భయపడే రకమా కాంగ్రెస్!
మమతా బెనర్జీ... తృణమూల్ పార్టీ లీడర్.
లీడర్‌లకు, క్యాడర్‌లకు కొరుకుడు పడే ఘటమా కాంగ్రెస్!
మమతా బెనర్జీ... అగ్గిరవ్వ, తారాజువ్వ.
రవ్వలకి, జువ్వలకి రాలే చింతకాయా కాంగ్రెస్!
అయినా... మమత చెప్పినట్లే చేస్తానంది. దినేశ్‌ను వద్దు పొమ్మంది. ఎందుకంటే - పార్లమెంటులో మమతకు 19 సీట్లు ఉన్నాయి. అవి తగ్గితే కాంగ్రెస్ బలం తగ్గుతుంది. అప్పుడు మళ్లొకసారి కోర్ కమిటీ చెమటలు కక్కుకుంటూ సమావేశం కావలసి ఉంటుంది. పవర్ ఉండాలంటే కాంగ్రెస్‌కు కనీసం 272 సీట్లయినా నిండాలి.
అందుకోసం కాంగ్రెస్ ఎన్ని ఫీట్లయినా చేస్తుంది!
అందుకోసం సోనియా ఎమర్జెన్సీగా ఎన్ని ఉత్తరాలైనా రాస్తారు.
అందుకోసం చిదంబరం ఎలాంటి ప్రకటనైనా చేస్తారు.
అందుకోసం ఎ.కె. ఆంటోనీ ఎవరి ఇంటికైనా వెళ్తారు.
అందుకోసం ప్రణబ్, పటేల్ ఏ జాము మీటింగుకైనా హాజరవుతారు.
కానీ తృణమూల్ పార్టీ వేరు. తృణమూల్ పార్టీ అధినేత్రి మమత వేరు.
లెక్కల్నెప్పుడూ ఆమె లెక్క చెయ్యలేదు. ప్రజలు, వాళ్ల అవసరాలు తప్ప అసలు ఆమెకు ఏదీ లెక్క కాదు. అందింది కదా అని జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం ఆమెకు అలవాటు లేదు. మమత ఒక డిఫరెంట్ లీడర్.
నిజంగా డిఫరెంట్!

********

20 మే 2011.
ముఖ్యమంత్రిగా మమత ప్రమాణ స్వీకారం పూర్తయింది. రాజ్‌భవన్ నుంచి రైటర్స్ బిల్డింగ్స్ (సచివాలయం)కి వెళ్లాలి. రోడ్డయితే ఉంది కానీ వెళ్లేందుకు దారి లేదు. కనీసం మూడు లక్షల మంది బెంగాల్ ప్రజలు తమ ‘దీదీ’ కి శుభాకాంక్షలు చెప్పడం కోసం క్రిక్కిరిసి ఉన్నారు.
‘‘నడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి’’ అని గవర్నర్‌ను అడిగి, ప్రజల మధ్యలోంచి అడుగు అడుగు వేసుకుంటూ... పుష్పగుచ్ఛాలు, ఆశీర్వచనాలు అందుకుంటూ సచివాలయం చేరుకున్నారు మమత.
పదిహేడేళ్ల తర్వాత మళ్లీ ఆమె సచివాలయం గడప తొక్కడం అదే మొదటిసారి!
పదిహేడేళ్ల క్రితం ఒకరోజు - పోలీసులు మమతాబెనర్జీని అదే సచివాలయ ప్రాంగణం నుంచి ఈడ్చి పడేశారు! అప్పుడామె కాంగ్రెస్ లీడర్. అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసు. బసు కార్యాలయం బయట మమత నినాదాలిస్తున్నారు. సి.పి.ఎం. కార్యకర్తల అత్యాచారానికి గురైన బాధితురాలిని బసు పరామర్శించాలని ఆమె డిమాండ్.
బసు బయటికి రావడం లేదు. మమత బయటికి వెళ్లడం లేదు.
మధ్యలోకి పోలీసులు వచ్చేశారు. మమతను గెంటేశారు.
అదిగో... అప్పుడు చేశారు ఆవిడ ప్రతిజ్ఞ. బెంగాల్లో కమ్యూనిస్టుల కరెంట్ పోయేవరకు రైటర్స్ బిల్డింగ్‌లోకి అడుగు పెట్టనని ప్రకటించారు. చివరికి ప్రజలే ఆమె ప్రతిజ్ఞను నెరవేర్చారు!
ముఖ్యమంత్రి అయిన తొలి 48 గంటల్లోనే మమతంటే ఏమిటో బెంగాల్‌కి, బయటి ప్రపంచానికీ తెలిసిపోయింది. మొదట ఆమె అన్ని ప్రొటోకాల్స్‌ని బ్రేక్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి అధికార లాంఛనాన్నీ తీసి అవతల పడేశారు. బులెట్ ప్రూఫ్ కారు వద్దన్నారు. తన సొంత నలుపురంగు శాంత్రో - డబ్ల్యు బి 02 యు 4397 - కారులోనే విధులకు బయల్దేరారు. ఆ కారు... సిగ్నళ్ల దగ్గర ఆగుతూ, వాహనాలకు తోవ ఇస్తూ ముందుకు వెళ్లింది తప్ప... లోపల దీదీ ఉన్నారు కదా అని రయ్యిన రోడ్లను కోసుకుంటూ పోలేదు.
ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపించే విషయంలోనూ కోల్‌కతా రాజనీతిజ్ఞులు మునుపెన్నడూ ఎరుగని ప్రత్యేక మర్యాదల్ని మమత పాటించారు! డిప్యూటీ అసెంబ్లీ లీడర్ పార్థ చటర్జీ ఉదయం 8.35కి నేరుగా బుద్ధదేవ్ భట్టాచార్య (అప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రి) ఇంటికి వెళ్లి, తలుపు తట్టి దీదీ ఇమ్మన్నారంటూ ఆయన చేతికి ఇన్విటేషన్ అందించారు!
ప్రధాన రాజకీయ ప్రత్యర్థిని అంత పర్సనల్‌గా ఆహ్వానించడం బెంగాల్‌లో అదే మొదటిసారి.
ఇలాంటి ‘ఫస్ట్’లు ఇంకో రెండుమూడు కూడా ఉన్నాయి! సీమ అని... సెక్స్ వర్కర్. సోనాగంజ్ రెడ్‌లైట్ ఏరియాలో ఉంటుంది. ఆవిడక్కూడా మమత ప్రత్యేక ఆహ్వానం పంపారు. అలాగే, నెతాయ్, నందిగ్రామ్ ఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు మమత నుంచి హృదయపూర్వక ఆహ్వానాలు అందాయి.
లిఫ్టులోంచి కాకుండా, కిర్రుకిర్రుమని చప్పుడు చేస్తున్న పాతకాలం నాటి చెక్క మెట్లెక్కి తన క్యాబిన్‌కు చేరుకున్న తొలి బెంగాల్ ముఖ్యమంత్రి కూడా మమతా బెనర్జీనే! క్యాబిన్‌లోకి ప్రవేశించాకైతే పడిపడీ నవ్వుతున్న మమతను చూసి ఆశ్చర్యపోయే సాహసాన్ని అక్కడెవ్వరూ చేయలేకపోయారు.
నేలంతా పరిచిన ఖరీదైన కార్పెట్, కూర్చుంటే మెత్తగా సౌకర్యవంతంగా మనిషి లోపలికి కూరుకుపోయేంత ఒత్తుగా ఉన్న కుర్చీలు, క్యాబిన్ తలుపులకు కుషన్ ఫినిషింగ్, అందమైన డిజైన్లతో గోడలను కప్పి ఉంచిన ఫ్యాన్సీ ప్యానలింగ్... అన్నిటినీ మమత తీయించారు. తను కూర్చోడానికొక చెక్క కుర్చీ తెప్పించుకున్నారు. సందర్శకుల కోసం అలాంటివే మరికొన్ని కుర్చీలను తెమ్మన్నారు. గోడలకు క్రీమ్ కలర్ వేయించి, టాగూర్ చిత్ర పటంతో వాటికి నిండుదనం తెచ్చారు. తన గదికి కేటాయించిన స్థలాన్ని తగ్గించి, ఆ మేరకు సందర్శకుల గది నిడివిని పెంచమని ఆదేశించారు.
మమత ప్రమాణ స్వీకారం చేశాక తొలి కేబినెట్ మీటింగ్ తొలిరోజే సాయంత్రం ఐదు గంటలకు జరిగింది! తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ రాత్రి ఎనిమిది గంటలకు ఏర్పాటయింది. సచివాలయం క్యాటిన్ అంతసేపు ఉండదు.
‘‘క్షమించండి. మీకు టీ గానీ, స్నాక్స్ గానీ ఇవ్వలేకపోతున్నా’’ నంటూ, సాయంత్రం ఐదు తర్వాత కూడా క్యాంటిన్ ఉండే ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని పాత్రికేయులకు ఆమె హామీ ఇచ్చారు. ఆ రాత్రి పన్నెండున్నర వరకు ఆమె ఆఫీస్‌లోనే ఉన్నారు. క్యాబినెట్ మంత్రుల పూర్తి జాబితాను ఖరారు చేశారు.
తొలి రెండు రోజులూ సచివాలయం అంతా కలియదిరిగారు మమత. ఆ రెండ్రోజుల్లోనే దాదాపు ఇరవై మంది మంత్రులతో మాట్లాడారు. కొంతమంది మంత్రుల క్యాబిన్‌లకు తనే స్వయంగా వెళ్లారు.
‘‘మీ ఆఫీస్ గది ఎలా ఉందండీ’’ అంటూ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిరద్ హకీమ్ క్యాబిన్‌లోకి అడుగుపెట్టి, ‘‘ఫర్వాలేదు. నా గది కన్నా బ్రైట్‌గా ఉంది’’ అని నవ్వారు. దుమ్ము పట్టి గోడకు వేలాడుతున్న డాక్టర్ బిదాన్ చంద్రరాయ్ చిత్రపటాన్ని చూసి, ‘శుభ్రం చేయించండి’ అని చెప్పి నిష్ర్కమించారు.
అయితే - నలభైకి పైగా శాఖలు పంచాక కూడా హోమ్ శాఖ, వ్యవసాయం, భూములు, భూసంస్కరణలు, ఆరోగ్యం, విద్యుత్తు, సమాచార, సాంస్కృతిక శాఖలు, మైనారిటీ వ్యవహారాలు, సిబ్బంది, పరిపాలన వంటి కీలకమైన శాఖలను మమత తన దగ్గరే ఉంచేసుకోవడం కొందరికి నచ్చలేదు.
కానీ తృణమూల్ పార్టీలో ఎక్కువ మంది బలంగా విశ్వసించే నియమాలు రెండు ఉన్నాయి.
రూల్ నెం.1: దీదీ ఎప్పుడూ తప్పు చేయదు.
రూల్ నెం. 2: దీదీ తప్పు చేసినట్లు అనిపిస్తే గనుక రూల్ నెం.1ని చూడండి.

********

మొహమాటాల్లేని మనిషి మమత. ‘నీకోసం అది చేశాను, ఇది చేసేశాను. అవన్నీ మర్చిపోయి ఇప్పుడిలా చేస్తావా’ అని అడిగితే - ఎంతటి వాళ్లకైనా ఆమె చెప్పే సమాధానం ఒక్కటే... ‘‘నీకూ నాకూ జరగడం కాదు, ప్రజలకు ఏం జరిగిందన్నదే నా ప్రయారిటీ’’ అని. ప్రజల కోసమే మొన్నటి రైల్వే బడ్జెట్‌లో ఆమె యు.పి.ఎ. సర్కారుకు నీళ్లు తాగించారు. మమత తగాదాలు, వివాదాలు, నినాదాలు, నిరశనలు, రాజీనామాలు అన్నీ ప్రజల కోసమే.

రైల్వే మంత్రి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి మమత పొగలు తెప్పించడం ఇదే మొదటిసారి కాదు. 1997 ఫిబ్రవరిలో లోక్‌సభకు బడ్జెట్ సమర్పిస్తున్న రైల్వే మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ముఖం మీదికి ఆవిడ తన షాల్‌ను విసిరికొట్టారు. పాశ్వాన్ బిత్తరపోయారు. అదేం పట్టించుకోలేదు మమత. ఇదేం బడ్జెట్ అని నిలదీశారు. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బడ్జెట్‌లో బెంగాల్‌కు అసలేం లేదని ఆమె చిరాకు.

స్పీకర్ పి.ఎ. సంగ్మా... పాశ్వాన్‌కి అపాలజీ చెప్పమన్నారు. రాజీనామాను వాపస్ తీసుకోమన్నారు. రెండూ చెయ్యలేదు మమత. తర్వాత ఎంపీ సంతోష్ మోహన్‌దేవ్ వచ్చి నచ్చజెపితే రాజీనామా నిర్ణయాన్నయితే మార్చుకున్నారు కానీ, సారీ మాత్రం చెప్పేది లేదన్నారు.

ఏ పార్టీలో ఉన్నదీ, ఏ పదవిలో ఉన్నదీ, ఎవరికి మద్దతు ఇస్తున్నదీ ముఖ్యం కాదు దీదీకి. తను అనుకున్నది నెరవేరాలి. అంతే. అయితే తనెప్పుడూ తనకోసం ఏదీ అనుకున్నది లేదు. పశ్చిమబెంగాల్ మాత్రమే పార్లమెంటులో ఆమె అజెండా.

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మమత కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు. యూత్, స్పోర్ట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ శాఖలను చూస్తున్నారు. ‘దేశంలో క్రీడారంగం నీరసించి పోయింది. కాస్త గ్లూకోజ్ ఎక్కించండి’ అని మమత ఎంత మొత్తుకున్నా ఎవరూ విన్లేదు. చిర్రెత్తుకొచ్చి కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో పెద్ద ర్యాలీ తీశారు. రిజైన్ చేస్తానని హెచ్చరించారు. మమతతో వేగలేక కాంగ్రెస్ ఆమె శాఖలన్నిటినీ ఇంకొకరికి మార్చింది. అయినా దీదీ మారలేదు. కాంగ్రెస్‌లో ఉంటూ కాంగ్రెస్ చెవుల్ని మెలిపెట్టారు. మొటిక్కాయలు వేశారు. సిగ్గూశరం ఉండక్కర్లా అని కడిగేశారు.

బెంగాల్లో సి.పి.ఐ-ఎం.కి కాం గ్రెస్ తొత్తులా బిహేవ్ చేస్తోందని 1996 ఏప్రిల్లో మమత బహిరంగంగా ఆరోపించినప్పుడు కాంగ్రెస్ ముఖమంతా గంటు పెట్టుకుంది. ఇంటి రహస్యాలను బైటికి చెప్పుకుంటారా అని ప్రత్యేక దూతలు కొందరు ఢిల్లీ నుంచి వచ్చి లాజికల్‌గా కన్విన్స్ చెయ్యబోయారు కానీ ఆమె కాలేదు. పనికిమాలిన లాజిక్కులు నా దగ్గర మాట్లాడొద్దన్నారు. కమ్యూనిస్టుల ముక్కు బద్దలు కొట్టకుండా వాళ్లతో ముద్దూ ముచ్చటేమిటని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను క్లీన్ చెయ్యడానికి ఎవరూ కలిసిరాకుంటే నేనొక్కదాన్నే చీపురు పట్టుకుంటాను అన్నారు. దూతలు వెనక్కి వెళ్లిపోయారు.

ఆ ఏడాది పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు కూడా మమత పార్లమెంటులో భగ్గుమన్నారు. తగ్గించండి లేదా తప్పుకోండి అని గట్టిగా అరిచారు. ‘ఏమ్మాయ్.. నువ్వసలు మన పార్టీ మనిషివేనా’ అని సభలో అలజడి. ఆ గొడవలోనే మమతా బెనర్జీ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అమర్‌సింగ్ కాలర్ పట్టుకుని గుంజారు.

ఇలాంటి గతే 1998లో మరో సమాజ్‌వాదీ ఎంపీ దరోగా ప్రసాద్ సరోజ్‌కి పట్టింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభ నడవాలోకి వెళ్లి హంగామా చేస్తున్న దరోగాను కాలర్ పట్టి లాక్కుంటూ వెళ్లారు మమత. అప్పటికి ఆమె కాంగ్రెస్‌లో లేరు. అంతకు క్రితం ఏడాదే కాంగ్రెస్ నుంచి బైటకి వచ్చి, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. తర్వాత ఎన్.డి.ఎ.లోకి మారారు. తొలిసారి ఆమె రైల్వే మంత్రి అయింది అప్పుడే.

సరే, ఇదంతా కేంద్రంలో.
రాష్ట్రంలోనైనా మమత ఎవర్ని నిద్రపోనిచ్చారని! ముఖ్యంగా కమ్యూనిస్టులకు కంట కనుకు లేకుండా చేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం ఇండోనేషియాలోని సలీమ్ గ్రూప్ కంపెనీకి ఇవ్వడం కోసం హౌరా ఏరియాలో భారీ ఎత్తున రైతుల నుంచి భూమిని సేకరించే ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు మమత, తృణమూల్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒప్పందం కోసం వచ్చి తాజ్ హోటల్లో బస చేసిన కంపెనీ సి.ఇ.వో. బెన్నీ శాంటోసోను బయటికి రానివ్వకుండా భోరున కురిసే వర్షంలో తడుస్తూ అడ్డుగా నిలబడ్డారు. వాళ్ల నుంచి బెన్నీని తప్పించడానికి బుద్ధదేవ్... వెనకదారులు తెరిపించవలసి వచ్చింది!

అప్పటికి తృణమూల్ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎంపీ. మమత.
దీదీ ఎక్కడుంటే అక్కడ ప్రత్యర్థులకు ఏదో భయం. బెంగాల్లో ఉంటే లోకల్ కమ్యూనిస్టులు కాస్త చూసి నడిచేవారు. పార్లమెంటులో ఉంటే జాతీయ కాంగ్రెస్‌వాదులు సర్దుకుని కూర్చునేవారు. ఈ నిప్పురవ్వ ఎప్పుడు ఎవరిపై ఎగసిపడుతుందో ఎవరికీ తెలీదు!

2006 ఆగస్టు 4న మమత తన రాజీనామా పత్రాలను లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ మీదికి విసిరిగొట్టారు. పశ్చిమబెంగాల్ సరిహద్దుల నుంచి అక్రమంగా చొరబడుతున్న బంగ్లాదేశీయుల విషయమై మమత వాయిదా తీర్మానాన్ని కోరినప్పుడు స్పీకర్ సోమనాథ్ చటర్జీ కాదన్నారు. మమతకు ఒళ్లు మండిపోయింది. అందుకే రాజీనామా!

తర్వాత నవంబర్‌లో మమత ధాటికి బెంగాల్ అసెంబ్లీ గజగజలాడింది. సింగూర్‌కి టాటా వాళ్లొస్తే కాళ్లిరగ్గొడతాం అని మమత అసెంబ్లీ బయట బైఠాయించారు. అసెంబ్లీ లోపల తృణమూల్ ఎమ్మెల్యేలు ఫర్నీచర్‌ను, మైక్రోఫోన్‌లను బద్దలు కొట్టారు.

నందిగ్రామ్‌లో పదివేల ఎకరాలను సేకరించేందుకు వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులను గ్రామస్థులు అడ్డుకున్నప్పుడు చెలరేగిన పోలీసు హింసపై కూడా దేశ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి, కేంద్ర హోమ్ మంత్రి శివరాజ్ పాటిల్‌కు మమత ఘాటుగా ఉత్తరాలు రాశారు. వెంటనే భూసేకరణ ఆగిపోయింది! సి.పి.ఐ-ఎం. గవర్నమెంటు అక్కడ ఏర్పాటు చేయించదలచిన కెమికల్ హబ్ ప్రాజెక్టు అటకెక్కింది. తర్వాత జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో (2009) తృణమూల్ పార్టీకి 19 సీట్లు వచ్చాయి!

అయితే సీట్ల కోసం, ఓట్ల కోసం దరువులు, డ్రామాలు వేసే మనిషి కారు మమత. ప్రజల కోసం తను ఎంతైతే చెయ్యగలరో అంతా చేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకు అడ్డొచ్చిన వారిని హక్కుగా నిలదీస్తారు. వారు ఏ పార్టీవారైనా, ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా!

********

నిన్న, మొన్న బడ్జెట్‌ల సమర్పణ సమయంలో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పోయించిన మమతను చూసి ఆ పార్టీ ఒకందుకు గర్వించాలి. కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ నుంచి ఎదిగిన వ్యక్తి మమత. అయితే ఆ మాటను దీదీ ఒప్పుకోరు. ‘‘నేనెక్కడికీ ఎదగలేదు. ప్రజల మధ్యలోనే ఉన్నాను’’ అంటారు.
మమత అతి చిన్నవయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఇరవై ఏళ్లకే పశ్చిమ బెంగాల్ మహిళా కాంగ్రెస్ (ఐ) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు! 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికై యంగెస్ట్ పార్లమెంటేరియన్‌గా రికార్డు బద్దలు కొట్టారు. (అప్పటి వరకు ఆ రికార్డు సీనియర్ కమ్యూనిస్టు లీడర్ సోమనాథ్ చటర్జీ పేరు మీద ఉండేది). అలాగే కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా శక్తిమంతమైన నాయకురాలిగా ఆమె ఎదిగారు.
రాజకీయాలలోకి ప్రవేశించినట్లే, చదువులలోకీ చాలా త్వరగా వచ్చేశారు మమత. బెంగాల్‌లో రాజకీయ పరిస్థితులు అడ్డదిడ్డంగా ఉండి, సామాన్య ప్రజలు సతమతమౌతున్న సమయంలో ఆమె కాలేజీలో ఉన్నారు.
కాలేజీలో ఉన్నప్పుడే ఆమె తండ్రి చనిపోయారు!
మమత తల్లి, అన్న, ఇద్దరు తమ్ముళ్లు ఆ దుఃఖంలో ఉన్నారు. రెండో తమ్ముడు స్వపన్ బెనర్జీకి అప్పుడు రెండేళ్లు. అందరూ ఏడుస్తుంటే తనూ ఏడుస్తున్నాడు. మమత వాడిని దగ్గరికి తీసుకుంది. తల మీద చెయ్యి వేసింది.
‘‘ఆ రోజు మా దీదీ నాతో అన్నమాటలు ఇప్పటికీ గుర్తు. భయం లేదు. నీకు నేనున్నాను అంది. ఆ మాట నిలబెట్టుకుంది. ఇప్పుడామె మా ఒక్క కుటుంబానికే కాదు, బెంగాల్‌లో లక్షలాది మందికి దీదీ’’ అని స్వపన్ అంటుంటారు.
మమత తండ్రి కాంగ్రెస్ కార్యకర్త. ఆయన వారసత్వమే ఆమెలోని పొలిటికల్ ఫైర్.

********

మా - మాటీ - మనుష్ .
కన్నతల్లి, పుడమితల్లి, మానవాళి! ఇదే మమత స్లోగన్. ఇవే ఆమె ప్రసంగాలలోని ఎమోషన్స్. లక్ష్యం కోసం కుటుంబాలను అలక్ష్యం చేసిన ప్రజానాయకులు ఎందరో ఉన్నారు. మమత మాత్రం రెండిటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. తల్లి గాయత్రీ బెనర్జీ, అన్నదమ్ములు, ఆడపడుచులు, వారి పిల్లలతో ఆమె కలిసి ఉంటున్నారు. తల్లికి ఇవాళ్టికీ తనే స్వయంగా వంట చేసి వడ్డిస్తారు. ఆవిడా అంతే. కూతురికి ఎంతో ఇష్టమైన ‘నాదుస్’ (తియ్యని కొబ్బరి ఉండలు) తయారు చేసేందుకు ఈ ఎనభై ఏళ్ల వయసులోనూ ఎంతో ప్రయాసపడుతుంటారు! ఆడపడుచులు తమ వదినగారికి చిరుతిండిగా తెల్ల శెనగల తాలింపు గుగ్గిళ్లను అందిస్తుంటారు.

తల్లి దీవెనలు, ఆశీస్సులు అందుకోకుండా మమత ఒక్కనాడూ ఇల్లు కదల్లేదు. ఇప్పటికీ ఆమె సచివాలయానికి గానీ, సమర సన్నాహకాలకు గానీ బయల్దేరేముందు తల్లి అందించే నైవేద్యాన్ని కళ్లకు అద్దుకుని, దాంతో పాటు ఆవిడ ఇచ్చే పదిరూపాయల నోటును పదిలంగా అందుకుంటారు.

కాళ్లకు స్లిప్పర్స్, ఒంటికి ముతక చీర, ముఖంలోని అలసటను తెలియనివ్వని చిరునవ్వు... ఈ మూడింటి కాంబినేషన్‌తో ఒక సాధారణ స్త్రీలా కనిపిస్తారు మమతాబెనర్జీ. ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రజల్లోకి వెళ్లినా అంతే. ఎలాంటి మార్పూ ఉండదు. మనసుకు బాధ కలిగితే ఆ బాధను దాచుకునే ప్రయత్నం చేయరు. అయితే తన బాధ కన్నా, ఇతరుల బాధ ఆమెను ఎక్కువగా కదిలిస్తుంది. అప్పుడు మాత్రం ఎంత పెద్ద కోర్ కమిటీ అయినా ఆవిడ ఆగ్రహానికి గురికావలసిందే! గడగడలాడాల్సిందే!!
- సాక్షి ఫ్యామిలీ

బయోగ్రఫీ
మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

జననం : 5 జనవరి 1955
జన్మస్థలం : కలకత్తా
తల్లిదండ్రులు : గాయత్రి, ప్రమీలేశ్వర్ బెనర్జీ
తోబుట్టువులు : అన్న, ఇద్దరు తమ్ముళ్లు
చదువు : హిస్టరీలో డిగ్రీ (జోగమయ దేవీ మహిళా కళాశాల) ఇస్లామిక్ హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ (కలకత్తా యూనివర్శిటీ) ఎడ్యుకేషన్‌లో డిగ్రీ (శ్ర్రీ శిక్షాయతన్ కాలేజీ) లా డిగ్రీ (జోగేశ్ చౌదరి లా కాలేజ్)
వైవాహిక స్థితి : అవివాహిత
పార్టీ : తృణమూల్ కాంగ్రెస్
రాజకీయరంగ ప్రవేశం : పదిహేడేళ్ల వయసులో (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లోకి)
కాంగ్రెస్‌ను వదిలిపెట్టింది : 1997
చేపట్టిన పదవులు : ఎంపీ, రైల్వే మంత్రి.
ప్రస్తుత ప్రాతినిధ్యం : భవానీపూర్ (విధాన సభ నియోజకవర్గం)

రచయిత్రి, కవయిత్రి, గాయని!
మమతా బెనర్జీ మొత్తం ఏడుసార్లు లోక్‌సభ ఎన్నికలలో) ఎం.పి.గా గెలిచారు.

ఈ ఏడుసార్లూ దక్షిణ కోల్‌కతా నియోజకవర్గానికే ప్రాతినిధ్యం వహించారు.

రెండుసార్లు రైల్వే మంత్రిగా చేశారు.

రెండుసార్లు ఎన్.డి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు.

2011 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్‌ను ఓడించి, 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడారు.

స్త్రీ శిశు సంక్షేమం కోసం కృషి చేస్తున్న అనేక స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్నారు.

మమత రచయిత్రి, కవయిత్రి. దాదాపు 30 పుస్తకాలు రాశారు. పాటలు కూడా పాడతారు.

Send your response:  shekhar.cxz@gmail.com